తెలుగు సాహితీ పూదోటలో విరిసిన మల్లెపువ్వు మహాకవయిత్రి మొల్లమాంబ

*డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్,వేంపల్లి, మార్చి :14 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) తెలుగు సాహితీ పూదోటలో విరిసిన మల్లెపువ్వు మహాకవయిత్రి, మహాసాద్వి స్వర్గీయ మొల్లమాంబ అని రాజ్యసభ మాజీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి కొనియాడారు. వేంపల్లి లో శుక్రవారం స్వర్గీయ మొల్లమాంబ 586వ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ రామాయణం ఒక ఆదర్శ కావ్యం అన్నారు. ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో ఆది కవి వాల్మీకి మహర్షి తన రామాయణ కావ్యం ద్వారా, 24 వేల శ్లోకాలతో సమాజానికి తెలియ పరిచారన్నారు. అట్టి మహాకావ్యాన్ని కేవలం 871 గద్య పద్యాలతో, అలతి అలతి పదాలతో, తేట తెలుగు పదాలతో, కడప మాండలిక పదాలతో మహాకవయిత్రి మొల్లమాంబ ఆంధ్రీకరించి తెలుగు జాతికి అంకితం చేశారన్నారు. స్త్రీ విద్య నిషిద్ధం అనబడే రోజుల్లోనే రామాయణ మహా కావ్యాన్ని రచించి స్త్రీ జాతికి వన్నెతెచ్చిన మల్లెపూవు కవయత్రి మొల్ల. శూద్ర విద్య నిషిద్ధం అనబడే రోజుల్లో రామాయణ మహాకావ్యాన్ని రచించిన సూద్ర కుల సంజాత, శాలివాహన కుల సంజాత,కుమ్మరి కుల సంజాత కవయిత్రి మొల్ల.ఏ గురువు దగ్గర,ఏ పాఠశాలలో విద్యను అభ్యసించకపోయినప్పటికీ శ్రీ కంఠమల్లేశ్వరుని కృపతో రామాయణ మహా కావ్యాన్ని రచించిన సహజ పండితురాలు మొల్ల.ఆ జన్మ బ్రహ్మచారినిగా 90 సంవత్సరాల సుదీర్ఘ మానవ జీవన యాత్ర సాగించిన కారణజన్మురాలు శివ కేశవ భేదం తారాస్థాయిలో ఉన్న రోజుల్లోనే శివకేశవులు ఇద్దరు ఒకటేనని చాటు చెప్పిన మహనీయురాలు. అట్టి మహా కవయత్రి కడప జిల్లా, బద్వేలు నియోజకవర్గంలో గోపవరం మండలం,పెద్ద గోపవరం గ్రామంలో కేశవ శెట్టి కూతురుగా ప్రభవించడం గర్వకారణం. మొల్ల రామాయణం సుందర ప్రబంధ సంగీత సప్తస్వరాలు సమ్మేళనం. తెలుగువారికి వీనుల విందైన విశిష్ట కావ్యం సరళత్వానికి,లాలిత్యానికి మచ్చుతునక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాకవయత్రి మొ ల్లమాంబ జయంతిని అధికార పూర్వకంగా,రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమని తులసి రెడ్డి అన్నారు. మొ ల్లమాంబ జీవితం ప్రతి ఒక్కరికి,ప్రత్యేకించి ప్రతి మహిళకు ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం అని తులసి రెడ్డి కొనియాడారు. మొల్ల జయంతి కార్యక్రమంలో తులసి రెడ్డి సతీమణి నర్రెడ్డి అలివేలమ్మ, కాంగ్రెస్ పార్టీ వేంపల్లి మండల శాఖ అధ్యక్షులు రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి,ఉత్తన్న వెంకటేశు,వేమా రాజా, బండారు వెంకటేశు, శేఖర్, నామా వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *