సాక్షి డిజిటల్ న్యూస్ : ఫిబ్రవరి 14 (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).
మహాశివరాత్రి సందర్బంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయాలు మరియు ఇతర దేవాలయాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రత, ట్రాఫిక్ మరియు పలు అంశాలపై సమీక్షించి పలు సూచనలు తెలియచేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రధాన శివాలయాలు ప్రాంతాల్లో జరిగే జాతరలు, ప్రత్యేక పూజలు, రాత్రి జాతర కార్యక్రమాలు వంటి వాటిని గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల వద్ద అదనపు సిబ్బందిని మోహరించాలని, మహిళా భక్తుల భద్రత దృష్ట్యా మహిళా పోలీసులను నియమించాలని ఆదేశించారు. భక్తులు క్యూలైన్‌లో సజావుగా దర్శనం చేసుకోవటానికి బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని, తోపులాటలు, గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ఎక్కువగా జరిగే కార్యక్రమాల సందర్భంలో ప్రత్యేక గస్తీ బృందాలను నియమించాలని, సీసీటీవీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆలయాల సమీపంలో తాత్కాలిక పార్కింగ్ ప్రదేశాలు గుర్తించి, వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు చేయాలన్నారు. దర్శనానికి వచ్చే వారు భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన నగలు, మొబైల్ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో భగవంతుని దర్శించుకునేలా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ తెలిపారు. జిల్లాలో పొదిలి, త్రిపురాంతకం, భైరవకోన, మడనూరు మరియు మొదలైన ప్రాంతలోన్ని ప్రముఖ దేవాలయాలు వద్ద శివరాత్రి ఉత్సవాలు మరియు రథోత్సవాలు జరుగుతున్నాయని, పండుగ ఉత్సవాలు, ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎక్కువ సిబ్బందితో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డు లో ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పూర్తి స్ధాయి బందోబస్తుతో అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఏమైనా ఉంటే స్థానిక పోలీసు వారికి గాని లేదా 112/100 నంబర్లకు గాని తెలియపరచాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కనిగిరి డిఎస్పి పి.సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు సిబ్బంది ఉన్నారు.