సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ అందించే శాఖలు రెవిన్యూ ఆదాయ లక్ష్యాలను అధిగమించాలని, మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ శాఖలలో జరిగే పనులపై జిఎస్టి వసూలు పక్కాగా జరగాలని మోటార్ వెహికల్ వాహనాల షో రూములలో ధరల పట్టిక ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లాలో రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని అందించే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు,రవాణా శాఖ, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ శాఖ, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖ లకు ఆదాయ వనరుల పెంపుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని శాఖల వారీగా ఆదాయ సాధన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖపై సమీక్షిస్తూ.నాటు సారా మరియు నకిలీ మద్యం అమ్మకాలు జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సమీప కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణా కాకుండా గట్టి నిఘా పెంచాలని వీటి అమ్మకాలు జరగడం వల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడడమే కాకుండా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ అంశంపై ఎలాంటి ఉపేక్ష ఉండరాదని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ శాఖపై సమీక్షిస్తూ జీఎస్టీ వసూళ్ల పై పెండింగ్ లో బకాయిలు, కేసుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టర్లు నుండి రావలసిన వసూళ్లకు సంబంధించిన వివరాలను వివిధ శాఖల అధికారులు జీఎస్టీ శాఖ అధికారులకు అందజేయాలని సమన్వయంతో కలిసి పనిచేసి జీఎస్టీ వసూళ్లను పెంచాలని ఆదేశించారు. పెండింగ్ జీఎస్టీ బకాయాలను సమీక్షించుకొని వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు.పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రత్యేక ఇన్ఫోసిమెంట్ డ్రైవ్ నిర్వహించి, ఫేక్ బిల్లులు బోగస్ సంస్థలపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖ పై సమీక్షిస్తూ. జిల్లాల్లో ఉన్న మోటార్ వెహికల్ షోరూమ్‌లలో వాహనాల ధరల పట్టిక లో ఇన్వాయిస్ ధరను వినియోగదారులకు స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇన్వాయిస్లో చూపిన ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఎవరైనా డీలర్ డిమాండ్ చేసినట్లయితే, వినియోగదారులు వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి అక్రమాలకు సహకరించకుండా చట్ట పరిరక్షణకు తోడ్పడాలని ప్రజలను కోరారు. ప్రజలు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారుల నుండి అధికారిక బిల్లుల కన్నా ఎక్కువ వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు తరచుగా షోరూమ్‌లను పర్యవేక్షించి ప్రజలతో మమేకమై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి త్రైమాసికానికి పన్నులు కట్టాల్సిన వాణిజ్య వాహనాలపై తనిఖీలు నిర్వహించి, వాటిని గుర్తించి పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పై సమీక్షిస్తూ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన ప్రతి బిల్లులో జిఎస్టి ఉండేలా చూడాలని ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖతో సమన్వయం చేసుకొని జీఎస్టీ ని రాష్ట్ర ఖజానాకు అందేలా చూడాలన్నారు. మునిసిపల్ శాఖ మరియు పంచాయతీలపై సమీక్షిస్తూ మునిసిపల్ శాఖలో చేసిన పనులకు జిఎస్టి శాఖతో సమన్వయం చేసుకొని జిఎస్టి వసూలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. మునిసిపాలిటీలు మరియు పంచాయతీలు సకాలంలో పన్నులు వసూలు చేయాలని, జిల్లాలోని లేఅవుట్లపై తనిఖీలు నిర్వహించి అనధికారిక లేఔట్ లపై జరిమానాలు విధించాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించా లని అధికారులకు ఆదేశించారు. మైనింగ్ శాఖ పై సమీక్షిస్తూ. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న మైనింగ్ లీజులను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వెంటనే పునరుద్ధరించి మైనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖపై సమీక్షిస్తూ.. ప్రజలకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పై అవగాహన పెంచి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి చుక్కల భూములు, 22ఏ లపై ఇచ్చిన ఆదేశాలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం అన్ని అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ప్రతినెల దీనిపై సమీక్ష సమావేశం సంబంధిత శాఖలతో జరుగుతుందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటూ రెవెన్యూ ఆదాయ శాఖల్లో వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, లక్ష్య సాధనలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా కట్టుదిట్టంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ, రవాణా శాఖ, జీఎస్టీ, డిపిఓ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మైనింగ్, అటవీ శాఖ, మదనపల్లి, పుంగనూరు, బి.కొత్తకోట మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.