సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, చిత్తూరు టౌన్(రిపోర్టర్ – జయచంద్ర): అపోలో యూనివర్శిటీలో వరల్డ్ పల్సెస్ డే సందర్భంగా కుకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వంటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, న్యాయ నిర్ణేతగా మిసెస్ వీసీ డా. పార్వతి భట్ హాజరుకాగా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ వంటల పోటీల్లో విద్యార్థులు పప్పుదినుసులతో రూపొం దించిన ఆరోగ్యకరమైన మరియు సృజనాత్మక వంటకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మిసెస్ వీసీ డా. పార్వతి భట్ మాట్లాడుతూ పరిమిత పదార్థాలతో విద్యార్థులు వివిధ ప్రాంతాల వంటకాలను అద్భుతంగా తయారు చేయడం వారి ప్రతిభను చాటిందన్నారు. యువత ఇంటి బాధ్యతలను కూడా అర్థం చేసుకోవాలని, కనీసం సంవత్సరంలో ఒకటి రెండు రోజులు అయినా వంట వంటి పనుల్లో పాల్గొనాలని సూచించారు. యువకులు ఈ పోటీల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయం అన్నారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొ. ఎం. పోతరాజు మాట్లాడుతూ వంటల పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయం అన్నారు. చదువుతో పాటు ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతోనే అపోలో యూనివర్శిటీ లో వివిధ క్లబ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వంటలు మహిళలకే పరిమితమనే అభిప్రాయం మారుతోం దని, ఈ పోటీల్లో అబ్బాయిలు కూడా సమానంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రత్యేక వంటకాలను చూసే అవకాశం లభించిందని చెప్పారు. విద్యార్థుల్లో క్రాస్ కల్చరల్ అవగాహన పెంపొందించడం అపోలో లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కుకింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించి, క్యాంపస్లో జరిగే కార్యక్రమాల్లో విద్యార్థులకు ఉచితంగా స్టాల్స్ కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పోటీల్లో విద్యార్థినులు జి. రామేన్ తబసు, పూజిత, ధరణి వరుసగా మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచారు. విజేతలకు ముఖ్య అతిథి మిసెస్ వీసీ డా. పార్వతి భట్, రిజిస్ట్రార్ ప్రొ. ఎం. పోతరాజు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కుకింగ్ క్లబ్ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ రూత్ మోనికా వెంకటేశన్, ప్రెస్ అండ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కీర్తన, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
