సాక్షి డిజిటల్ న్యూస్- ఫిబ్రవరి 14- సనత్ నగర్- పేద ప్రజలకు మెరుగైన వైద్యం భారంగా మారిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సనత్ నగర్ లోని బి కె గూడ లో గల సీనియర్ సిటీజన్స్ కౌన్సిల్ కార్యాలయంలో లయన్స్ క్లబ్, మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన డెంటల్, క్యాన్సర్, గుండె తదితర వివిధ విభాగాల వైద్యుల వద్దకు వెళ్ళి మాట్లాడారు. ఎమ్మెల్యే కు బిపి పరీక్ష చేయగా నార్మల్ ఉంది. నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్ కు చెందిన వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని నిర్వాహకులు ఎమ్మెల్యే కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది పేద ప్రజలు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం ఎంతో ఖరీదుగా మారడంతో ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతూ వైద్యం చేయించుకునేందుకు వెనుకాడాల్సిన పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళితే పరీక్షల కోసమే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన ఏర్పడిందని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న నిమ్స్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ కు అదనంగా నగరంలోని ఎర్రగడ్డ, అల్వాల్, కొత్తపేట ప్రాంతాలలో నూతన హాస్పిటల్ ల నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత కూడా కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. పేద ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత వైద్య శిబిరాలను ఉపయో గించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. శిబిరం నిర్వాహకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి రమాదేవి, కుసుమ విజయ కుమారి, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు దూబే, మాజీ అధ్యక్షుడు పార్థసారధి, మానిక్ రావ్ పాటిల్, బి ఆర్ ఎస్ పార్టీ సనత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు కరుణాకర్ రెడ్డి, అనంత రెడ్డి, రామ్ నివాస్ బన్సాల్, భద్రయ్య, కరీం లాలా, శేఖర్, హరిసింగ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.