తెలంగాణ కార్మిక సంఘాల భారీ సమ్మె కార్మికులకు మరణ శాసనంగా తెచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దుకై పోరాడుదాం

*పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం

సాక్షి డిజిటల్ న్యూస్ 13 ఫిబ్రవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం-2025, విబి జి-రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎన్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉప సంహరించాలని, కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపు భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుండి తహశీల్దార్ చౌరస్తా వరకు సి ఐ టి యు. ఎ ఐ టి యు సి. ఐ ఎఫ్ టి యు. ఎ ఐ ఎఫ్ టి యు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం జరిగిన సభలో సి ఐ టి యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ* కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని నిరాయుధులను చేసి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్లకు బంగారు పళ్ళెంలో పెట్టి బహుమానం ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను 6 సం॥ల క్రితం తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడిన ఫలితంగా ఇంతకాలం వాటిని అమలు చేయకుండా ఆపగలిగాము. కానీ నేడు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుతో కార్పొరేట్ సంస్థల సులభతర వ్యాపారానికి ద్వారాలు తెరిచింది. కార్పొరేట్ల ప్రయోజనాలు, వారి లాభాలు పెంచేందుకే 2025 నవంబర్ 21న లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది.2025 శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే సమయంలో హడావుడిగా మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబి జి-రామ్ జీ స్కీమ్ను తెచ్చి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపింది. విద్యుత్ సవరణ బిల్లు-2025, విత్తన సవరణ చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి లాంటి మరిన్ని వినాశకరమైన చట్టాలను, బిల్లులను తీసుకొచ్చి శ్రమజీవులపై దాడి చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న శ్రామిక వర్గాలను చావు దెబ్బ కొట్టిందని విటి రద్దు కోసం కార్మిక వర్గం స్వతంత్ర పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం చెయ్యాలని పిలుపు నిచ్చారు.ఎ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి ముఖ్రమ్,ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి చింతా భూమేశ్వర్,టి యు సి ఐ రాష్ట్ర నాయకులు భీమయ్య,ఎ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు లక్ష్మి లు మాట్లాడుతూ బ్రిటీష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం- 1926 ప్రకారం యూనియన్ల ఏర్పాటు కార్మికుల హక్కుగా పొందారు. కానీ ఈ లేబర్ కోడ్లతో కార్మికులు సంఘం పెట్టే హక్కు, సంఘటితమయ్యే హక్కు, నిరసనలు, సమ్మె చేసే హక్కులపై ఉక్కుపాదం మోపారు. ఉద్యోగ భద్రత పట్ల యాజమాన్యాలకున్న అన్ని బాధ్యతలను తొలగించారు. హైర్.ఫైర్ పద్ధతిని తీసుకొచ్చి పర్మినెంట్ ఉద్యోగాలకు మంగళం పాడారు. కోర్ యాక్టివిటీలో సైతం విచ్చలవిడిగా కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడం చట్టపరం చేశారు. ఫిక్స్డ్ టర్మ్ ఉపాధిని శాశ్వతం చేసింది. ఈ విధానం వల్ల పెట్టుబడిదారులకు అనేక రెట్లు లాభాలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఎన్ని పని గంటలు ఉండాలో, ఎప్పుడు విరామం ఉండాలో, ఎంత స్ప్రెడ్ ఓవర్ టైమ్ ఉండాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లెల్లల బాలకృష్ణ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినం యొక్క పోరాట స్ఫూర్తిని నేటి కార్మికవర్గానికి తెలియకుండా చేసే ప్రయత్నాలకు పూనుకున్నారు. మన రాష్ట్రంతో పాటు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పని దినాన్ని 10 గంటలకు, స్ప్రెడ్ ఓవర్ టైమ్ను 12 గంటలకు పెంచుతూ చట్ట సవరణలు చేశారు. ఈ లేబర్ కోడ్లు ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ మరియు ప్రసూతి ప్రయోజనాల వంటి అన్ని ప్రయోజనాలను మింగేస్తాయి. ఇవి అమలైతే అధిక శాతం కార్మికులకు చట్టపరంగా సామాజిక భద్రతా పరిధి నుండి గెంటివేయబడతారు.కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకునేలా కార్మికవర్గం ప్రతిఘటనకు పూనుకోవాలి. లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందూరీ సులోచన కోమటి చంద్రశేఖర్, సి ఐ టి యు జిల్లా నాయకులు వెంకట చారి,బోర్ర శేఖర్, మహిపాల్, శంకర్, రమేష్,ఎ ఐ టి యు సి నాయకులు వెన్న మహేష్, శారద, అర్.రాంబాబు, ఎం.హన్మంత్, కె.శ్రీనీవాస్, ఎండీ.మెహిన్దిన్, ఐ ఎన్ టి యు సి నాయకులు మోహిజిద్ధిన్, ఐ ఎఫ్టియు ఎస్.గంగాధర్, ఎన్.గంగంధర్, వ్వకాస రాష్ట్ర నాయకులు భూతం సారంగపాణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శారదా, మల్యాల సురేష్ కోమటి చంద్రశేఖర్ సి ఐ టి యు వెన్న మహేష్ ఎ ఐ టి యు సి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *