అరుదైన వ్యాధులపై అపోలోలో జాతీయ సదస్సు

*అవగాహన పెంపుతోనే రేర్ డిసీజెస్‌పై విజయం: వీసీ డా. హెచ్‌. వినోద్‌ భట్‌

సాక్షి డిజిటల్‌ న్యూస్‌, ఫిబ్రవరి 13, చిత్తూరు టౌన్‌(రిపోర్టర్‌ – జయచంద్ర): అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా ది అపోలో యూనివర్సిటీలో జాతీయ సదస్సు నిర్వహించారు. బయోమెడికల్ సైన్సెస్ విభాగం, మెడికల్ జెనెటిక్స్ విభాగం, అపోలో హాస్పిటల్స్, సెంట్రల్ రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అరుదైన వ్యాధుల గుర్తింపు, నిర్ధారణ, జన్యు పరీక్షలు, ఆధునిక వైద్య సాంకేతికతల ప్రాధాన్యంపై నిపుణులు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డా. హెచ్‌. వినోద్‌ భట్‌ మాట్లాడుతూ అరుదైన వ్యాధులపై అవగాహన పెంపు అత్యవసరమని అన్నారు. ఇవి సాధారణంగా సంక్రమణ వ్యాధులు కాకుండా జన్యు సంబంధితవిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆధునిక సాంకేతికత, ప్రెసిషన్ మెడిసిన్ ద్వారా నిర్ధారణ సులభమవు తోందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అవగాహన పెరిగినా ఇంకా విస్తృత స్థాయిలో ప్రచారం అవసరమని పేర్కొన్నారు. జన్యు పరిశోధనలు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణకు దిశానిర్దేశం చేస్తున్నాయని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న కర్కినోస్ హెల్త్‌కేర్, బెంగళూరుకు చెందిన చీఫ్ డేటా ఆఫీసర్ డా. వినోద్ స్కారియా పర్సనల్ జీనోమ్స్ & ప్రెసిషన్ మెడిసిన్ అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఆధునిక జన్యు సాంకేతికత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని, ప్రతి రోగికి వ్యక్తిగతీకరించిన చికిత్స విధానాలు రూపొందించడం సాధ్యమవుతోందని వివరించారు. వర్చువల్‌గా పాల్గొన్న డా. వైభవ్ భండారి అరుదైన వ్యాధులపై ఆధునిక పరిశోధన విధానాలను వివరించగా, డా. సీమా కపూర్ నూతన శిశువుల జన్యు స్క్రీనింగ్ ప్రాముఖ్యతను వివరించారు. ముందస్తు పరీక్షల ద్వారా అరుదైన జన్యు వ్యాధులను తొలిదశలోనే గుర్తించి సమయానికి చికిత్స అందించవచ్చని తెలిపారు. సదస్సులో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొ. కె. భాస్కర్‌రెడ్డి, బయోమెడికల్ సైన్సెస్ విభాగాధిపతి ప్రొ. ఆర్. సత్యనారాయణ, డా. ఎన్. ఇందుమతి, అధ్యాపకులు డా. జి. గోపికృష్ణ, డా. హేమాద్రి రెడ్డి, డా. సి. సాయికళ్యాణి యోగిని, డా. యు.వి. ప్రసాద్, డా. ఏ.వి.ఆర్. కృష్ణారావు పాల్గొన్నారు. సింపోజియం కన్వీనర్‌గా డా. ఎం. జీవన్‌కుమార్‌, కో–కన్వీనర్‌గా డా. ఆర్. శ్రీరూప్ రెడ్డి వ్యవహరించారు. అరుదైన వ్యాధులు అంటే ఏమిటి, వాటిని ముందుగానే ఎలా గుర్తించాలి, జన్యు పరీక్షలు రోగులు మరియు కుటుంబాలకు ఎలా ఉపయోగపడతాయన్న అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, వైద్య నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరై చర్చల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *