కోదాడను కాపాడేది బీఆర్ఎస్

*కాంగ్రెస్ అరాచక పాలనకు మున్సిపల్ ఎన్నికలే తీర్పు *బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టాలి

సాక్షి డిజిటల్ న్యూస్ , జనవరి 29 2026 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్ కోదాడ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి రిఫరెండంలాంటివని, ప్రజలపై జరుగుతున్న అన్యాయాలకు సమాధానం చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. కోదాడలోని తన నివాసంలో ఆయన ఎన్నికల ప్రచార శైలిలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలైన నాటి నుంచి పోలీస్ లాకప్‌లు ఖూనీల కేంద్రాలుగా మారాయని, దళితులు, బలహీన వర్గాలే లక్ష్యంగా దాడులు జరుగుతు న్నాయని మండిపడ్డారు. “ఒక్క రాజేష్ ఘటన కాదు… ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. నేరం రుజువుకాకముందే, కోర్టు తీర్పు లేకుండానే ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించారు. ఇది చట్ట పాలన కాదని, కాంగ్రెస్ రాజకీయ అరాచక పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
సీఎంఆర్ఎఫ్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, అక్రమ రికవరీలు చేయడం, వాటిని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం కోదాడలో నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు. అవినీతిపై నిలదీస్తే, రాజకీయ కుట్రలు పన్ని తన పేరును లాగేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. “ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల పక్షాన నిలబడతా” అని స్పష్టం చేశారు. కోదాడకు సంబంధం లేని టూరిస్ట్ నేతలు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారికి మున్సిపల్ ఎన్నికలే బుద్ధి చెబుతాయని హెచ్చరించారు. కోదాడ ప్రజల కష్టాలు తెలిసిన బీఆర్ఎస్ నాయకులకే పాలన అప్పగించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు పోలీసులను ముందు పెట్టి రాజకీయాలు చేస్తే, బీఆర్ఎస్ ప్రజలను ముందుపెట్టి పోరాటం చేస్తుందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయడం అంటే అవినీతి పాలనకు చెంపదెబ్బ కొట్టినట్లేనని అన్నారు. బీఆర్ఎస్ గెలిచి మున్సిపల్ ఛైర్మన్ పదవి కైవసం చేసుకుంటేనే కోదాడలో అభివృద్ధి, భద్రత, న్యాయం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ ఎన్నికలు పదవుల కోసం కాదని, ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమని మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *