సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి లింగంపల్లి మహేష్, నేటి యువత పరిశ్రమల మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యాలు సాధించాల్సిన అవసరం ఉందని విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త జి. సరోజా వివేకానంద అన్నారు. మంగళవారం పి.బి. సిద్ధార్థ కళాశాల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు సంతృప్తిని అందించడమే నిజమైన విజయమని పేర్కొన్నారు. పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య సమన్వయం బలపడితేనే విద్యార్థులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందగలరని సూచించారు. కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగకరమైనదైనా, అది పూర్తిగా మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. విద్యార్థులు జీవిత చరిత్రలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడంతో పాటు తమ అనుభవాలను నిత్యం లిఖితపూర్వకంగా నమోదు చేసుకోవాలని సూచించారు. మంచి ఫలితాలు సాధించాలంటే ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, పని గంటలకు పరిమితులు పెట్టుకోకుండా కష్టపడి పనిచేయాలని ఆమె అన్నారు. మహిళా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి దశలో నేర్చుకోవడం అత్యంత ముఖ్యమని, సంకోచం, సిగ్గును వీడి ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంటరాక్టివ్ సెషన్‌లో విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉద్యోగావకాశాలు, ఉన్నత విద్యపై విలువైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఐ.ఎం.ఐ.ఎస్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, సీఐఐ (విజయవాడ) చైర్‌పర్సన్ డా. వి. నాగలక్ష్మి మాట్లాడుతూ, పరిశ్రమల్లో పురుష ఆధిపత్యం ఉన్నప్పటికీ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని సూచించారు. సీఐఐ (విజయవాడ) వైస్ ప్రెసిడెంట్ కోటగిరి అభినవ్ మాట్లాడుతూ, విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమం ముగింపులో కళాశాల డీన్ ప్రొఫెసర్ రాజేష్ సి. జంపాల పరిశ్రమలు, విద్యారంగాల్లో చేసిన విశేష సేవలకు గాను సరోజా వివేకానందను సన్మానించారు.
