అక్రెడిటేషన్ల జీవోను సమూలంగా సవరించాలి ‘ ప్రెస్’ స్టిక్కర్ యధావిధిగా ఉంచాలి

*మంత్రి ని, స్పెషల్ కమీషనర్ ను కలిసిన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య

సాక్షి డిజిటల్ న్యూస్- హైదరాబాద్ – జనవరి 28- మీడియా అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర సమాచార పౌరసంబధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంక లకు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, రాష్ట్ర కో-కన్వీనర్లు తన్నీరు శ్రీనివాస్, కుడుతాడు బాపురావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ రవి కుమార్, నాయకులు శ్రీధర్, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, సమాచార భవన్ లో కమీషనర్ ప్రియాంక ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీవో 252 సవరణ సమూలంగా జరగలేదని, మరోసారి జీవోను పున:సమీక్షించి సవరించాలని వారు కోరారు. జీవో సవరణలో కేబుల్ చానల్స్, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు న్యాయం జరగడం లేదని, గతంలో కేబుల్ ఛానల్స్ కు ఐఅండ్ పీఆర్ ద్వారా 12 రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కార్డులు, నాలుగు జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేవారని, ఈ విషయాన్ని తాము పలు తమరి దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, సవరించిన జీవోలో కేబుల్ చానల్స్ అంశమే లేకపోవడం బాధాకరమని అన్నారు. యూనియన్ గా తమ అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ కేబుల్ చానల్స్ విషయంలో, నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఇచ్చే కార్డుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని, అదే విధంగా ఎంపానల్మెంట్ లేని చిన్న, మధ్య తరహా పత్రికలకు గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చినట్లు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, అదే విధంగా రెగ్యులర్ గా నడుస్తున్న పత్రికలను ఎంపాన ల్మెంట్ చేయాలని వారు మంత్రిని, కమీషనర్ ను కోరారు. ‘ప్రెస్’స్టిక్కర్ నిబంధన తొలగించాలి
అక్రెడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలకు ‘ప్రెస్’ అని రాసుకోవాలంటూ జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య కోరారు. ఈ మేరకు ఆయన, పలువురు ఫెడరేషన్ నాయకులు మంగళవారం సమాచార పౌరసంబధాల శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సర్క్యలర్… జర్నలిస్టులను, జర్నలిజం వృత్తిని అవమానించేదిగా ఉందని, జర్నలిస్టులకు కేవలం సంక్షేమ పథకాల కోసం గుర్తింపు కార్డుగా ఇచ్చే అక్రెడిటేషన్ కార్డును జర్నలిస్టుగా గుర్తించేందుకు ప్రామాణికం చేయడం తగదని, అక్రెడిటేషన్ కార్డు ఉన్న వారే తమ వాహనాలకు “ప్రెస్”అని రాసుకోవాలనే నిబంధన సరైంది కాదని, ఈ సర్క్యులర్ నిబంధన ఇటు జర్నలిస్టుల సమాజానికి, అటు జర్నలిజం వృత్తి స్వేచ్ఛకు భంగం కలుగు తుందని మామిడి సోమయ్య కమీషనర్ తో అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ కార్డు కలిగి ఉన్న జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టులు కాదని, అక్రెడిటేషన్ కార్డు లేని జర్నలిస్టులు చాలా మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది జర్నలిస్టులు వుండగా, వీరిలో సగం మందికి మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఇస్తున్నదని, మిగతా సగం మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్ ఎన్ ఐ (ప్రస్తుత పీ ఆర్ జీఐ) రిజిస్ట్రేషన్ పొందిన మీడియా సంస్థలు గుర్తింపు కార్డులతో పనిచేస్తున్నారని అన్నారు. ఎంపానల్మెంట్ లేని మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఉండవని, అంత మాత్రాన ఆ జర్నలిస్టులను జర్నలిస్టులే కాదనే విధంగా తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్ పెట్టుకోవద్దంటూ ప్రభుత్వం నిబంధనలు విధించడం సరైంది కాదని అన్నారు. సమాజంలో నకిలీ జర్నలిస్టులను కట్టడి చేయడానికి అనేక మార్గాలున్నాయని, ప్రత్యేక రూల్స్ ద్వారా నియంత్రించవచ్చని, అలాంటి చర్యలకు తామేమీ వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో అసలైన జర్నలిస్టులను అవమానించడం, అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డు లేని అనేక మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో తమరు జారీ చేసిన సర్క్యులర్ “మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు”గా అంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్క్యులర్ నిబంధన ను వెంటనే ఉపసంహరించాలని మామిడి సోమయ్య కోరారు. దీనిపై పునరాలోచన చేస్తామని, రవాణాశాఖ అధికారులతో చర్చిస్తానని కమీషనర్ ప్రియాంక హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *