(సాక్షి డిజిటల్ న్యూస్ బి ప్రభాకర్శంషాబాద్, జనవరి 28): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ (AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు, సీఐటీయూ (CITU) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జి. కవిత పిలుపునిచ్చారు. మంగళవారం శంషాబాద్ మండల కేంద్రంలోని హోటల్ ఎలైట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చట్టాల నిర్వీర్యం – కార్పొరేట్లకు కొమ్ముకాస్తుండటంపై ధ్వజం నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిని కేవలం నాలుగు కోడ్లుగా మార్చిందని పర్వతాలు విమర్శించారు. ఈ చర్య ద్వారా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ, కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోపిడీ చేసే అవకాశం కల్పిస్తోందని మండిపడ్డారు. దేశంలోని అఖిల భారత కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయని ఆయన తెలిపారు.
ప్రజలపై భారాలు – నిరుద్యోగ సమస్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు నూతన విద్యుత్ చట్టాల పేరుతో సామాన్య వినియోగదారులపై భారాలు మోపుతున్నారని నేతలు ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతున్నా, అరికట్టడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఫిబ్రవరి 12న తుక్కుగూడలో జిల్లా సదస్సు సమ్మె సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 12న తుక్కుగూడలోని లక్ష్మీ గార్డెన్లో ఉమ్మడి జిల్లా కార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సదస్సుకు జిల్లాలోని కార్మికులు, శ్రామికులు పెద్ద ఎత్తున హాజరై సమ్మెను జయప్రదం చేసేందుకు సమాయత్తం కావాలని కోరారు. పాల్గొన్న నేతలు: ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే. రంగస్వామి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి దత్తు నాయక్, సీపీఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి తదితరులు పాల్గొన్నారు.
