ప్రాణాలు తీస్తున్న షాద్‌నగర్ చౌరస్తా నిర్లక్ష్యం – విస్తీర్ణం చేపట్టాలని గణతంత్ర దినోత్సవం నాడు యువకుడి వినూత్న నిరసన

సాక్షి డిజిటల్ న్యూస్ 26/జనవరి/2026 షాద్ నగర్ :రిపోర్టర్/కృష్ణ, షాద్‌నగర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తా విస్తీర్ణం చేపట్టకపోవడం వల్ల రోజురోజుకీ ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతూ, రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన విస్తీర్ణం లేకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారుల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా యువకుడు ఆర్.ఎన్. రాము వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. కేశంపేట్ రోడ్, రతన్ కాలనీ తదితర ప్రాంతాల్లో బైక్‌పై తిరుగుతూ, కాలనీ ప్రజలకు, యువతకు చౌరస్తా విస్తీర్ణం అవసరాన్ని వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడాలంటే వెంటనే రోడ్డు విస్తీర్ణం చేపట్టాలని ఆయన కోరారు. రాము చేపట్టిన ఈ నిరసనకు అన్ని పార్టీలకు చెందిన నాయకులు, యువకులు మద్దతు ప్రకటించడం విశేషం. ఈ కార్యక్రమంలో నడికూడ రవి యాదవ్ (బీజేపీ నాయకుడు), అలీ భాయ్, జంగరాజు టీఆర్ఎస్ నాయకులు), ఎన్. అశోక్ యాదవ్, యాదవ్ సంఘం నాయకుడు రేణుకేష్ యాదవ్, సూరారం రాజు, పార్థ,పండ్ల మహేష్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి, షాద్‌నగర్ ప్రధాన చౌరస్తా విస్తీర్ణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *