సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 25, (శేరిలింగంపల్లి): ఓటు హక్కు వజ్రాయుధమని డాక్టర్ పూలపల్లి వెంకటరమణ అన్నారు. బిహెచ్ఈఎల్ టౌన్షిప్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ కవిత అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథి డాక్టర్ పూలపల్లి వెంకటరమణ మాట్లాడుతూ భారత ఎన్నికల కమీషన్ స్వయం ప్రతిపత్తి, విధులు మరియు ఎన్నికల సంస్కరణలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదై, ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నైతిక విలువలతో కూడిన అభ్యర్థులను ఎన్నుకోవాలని, నచ్చని పక్షంలో నోటా సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.దేశాభివృద్ధిలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ ఈ సందర్భంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అభిజిత్, అధ్యాపకులు అనురాధ, ప్రజ్వల, జనార్దన్ మరియు అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
