పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి

* జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు.

సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు రాము: అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తో కలసి అర్జీలను స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావుతో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో, సర్వే ఏ డి భరత్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ.. పిజిఆర్ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పిజిఆర్ఎస్ అర్జీలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 230 అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తో కలసి స్వీకరించారు. ప్రజల నుండి స్వీకరించిన కొన్ని విజ్ఞప్తులు. కలికిరి మండలం గొట్టపాలెం గ్రామపంచాయతీ కు చెందిన సి బాలయ్య మా గ్రామం పరిధిలోని సర్వేనెంబర్ 577లో 2.72 సెంట్ల భూమి 1970 వ సంవత్సరం నుంచి మా తండ్రి శంకరయ్యకు పిత్రార్జితంగా లభించి ఉన్న భూమిని సాగు చేసుకుంటూ ఉండేవారమని ప్రస్తుతం జీవన దారం కొరకు కూలి పనులు చేసుకుంటూ తిరుపతి లో నివసిస్తున్నామని గత ప్రభుత్వం రీ సర్వే చేసినప్పుడు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా భూమి ని రద్దు పరిచారని ఈ విషయమై సంబంధిత తాసిల్దార్ ను సంప్రదించగా పొంతన లేని సమాధానాన్ని ఇస్తున్నారని ఈ విషయమై తమరు విచారణ జరిపి న్యాయం జరిగే విధంగా చూడాలని డిఆర్ఓ ని కోరారు. రామసముద్రం మండలం పెద్ద కురువపల్లి పంచాయతీ పరిధిలోని తిరుమలరెడ్డి గ్రామానికి చెందిన బి.శివ శంకర్ తాను కూలి పని చేసుకొని వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి కుడి చెయ్యి పూర్తిగా తీసివేయడం జరిగిందని, అలాగే కుడికాలు మోకాలు చిప్ప పూర్తిగా అరిగిపోయి ఉండటంతో ఏ పని చేయలేక పోతున్నానని సదరం సర్టిఫికెట్ కింద 85 శాతం వికలాంగత్వం ఉందని తనకు దివ్యాంగ పింఛను ఇప్పించవలసిందిగా డిఆర్ఓకు విన్నవించు కున్నారు.
ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి కి వివిధ రకాల అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *