కూటమి దోపిడీకి అడ్డాగా వాడపల్లి దేవస్థానం

* నకిలీ టికెట్ల స్కాంపై సమగ్ర విచారణ జరపాలి చిర్ల జగ్గిరెడ్డి ధ్వజం.

సాక్షి డిజిటల్ న్యూస్ 20.1.2026: ​డా బిఆర్ అంబేత్కర్ కోనసీమ జిల్లాకొత్తపేట నియోజకవర్గం సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి చిర్రా నాగరాజు అంబేద్కర్ కోనసీమ ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వ దోపిడీకి అడ్డాగా మారిందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రావులపాలెంలోని వైఎస్ఆర్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. వాడపల్లి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నకిలీ టికెట్ల కుంభకోణం చోటుచేసుకుందని, ఈ స్కాంలో కేవలం ఒకరిపైనే ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేసి మిగతా వారిని కాపాడటంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి అసలైన సూత్రధారులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం గురించి గొప్పలు చెప్పుకునే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. భక్తుల మనోభావాలు దెబ్బతింటుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు.అదేవిధంగా ఆత్రేయపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల పేరుతో భారీ దోపిడీ జరిగిందని జగ్గిరెడ్డి ఆరోపించారు. పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులెన్ని, చందాల రూపంలో వసూలు చేసిన మొత్తం ఎంత అనే విషయాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కారని, స్థానిక ఎంపీపీ మరియు జడ్పిటిసిలను పక్కన పెట్టడం అధికారుల పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. దేవాలయాల పవిత్రతను కాపాడటానికి, ప్రజా సమస్యలపై పోరాడటానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *