
సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వెల్గటూర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ జనవరి 20/01/2026 వెల్గటూర్ మండలం: పెదపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతోందని తెలిపారు. జాతర నిర్వహణలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.జాతర సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి కొరత లేకుండా బోరుబావులు, తాత్కాలిక నీటి ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా, శుభ్రత నిర్వహణకు ప్రత్యేక చర్యలు, రవాణా సౌకర్యాల మెరుగుదలతో పాటు వైద్య శిబిరాల ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కలిసి సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతర పనుల సమీక్ష సమావేశంలో పాల్గొని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ తమ బాధ్యతలను స్పష్టంగా నిర్వర్తిస్తూ, జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ మండలంలో సుమారు 8 గ్రామాల్లో సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల జాతరలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.