సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 13, (శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ మీటింగ్ హాల్లో సోమవారం నిర్వహించిన శానిటేషన్ రివ్యూ సమావేశంలో జోనల్ కమిషనర్ హేమంత్ మాట్లాడుతూ, ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోని అంతర్గత రహదారులు కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితులు కాకుండా ముక్కున వేలేసుకునేంత శుభ్రంగా రహదారులు కనిపించాలంటే క్షేత్రస్థాయిలో చేపట్టే పారిశుద్ధ్య చర్యలే కీలక మన్నారు. ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లో ఆ స్థాయికి తగినట్లుగా రహదారుల నిర్వహణ జరగాలన్నారు. స్వీపింగ్ అనంతరం వెంటనే చెత్త కుప్పలు తొలగించాలని, ఫ్లైఓవర్లపై మట్టి, ఇసుక, ఇతర వ్యర్థాలు లేకుండా శుభ్రంగా ఉంచాలని సూచించారు. డీసీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించి లోటుపాట్లను సరిదిద్దుకుంటూ చక్కని పరిసరాలు నెలకొల్పాలన్నారు. ప్రతి షాపు మరియు కమర్షియల్ ఏరియాలో డస్ట్‌బిన్ ఏర్పాటు చేయాలని, ఈ నెల 15వ తేదీ చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. గడువు లోపు ఏర్పాటు చేయని దుకాణాలపై పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు ప్రశాంతి, శశిరేఖ, సురేష్, కృష్ణ, ప్రదీప్‌తో పాటు డీఈలు, ఎస్డబ్ల్యూఎంఎస్, ఎస్ఆర్పీ, ఎస్ఎఫ్ఏలు, రాంకీ సిబ్బంది పాల్గొన్నారు.