సాక్షి డిజిటల్ న్యూస్, 13/జనవరి/2026, షాద్ నగర్ రిపోర్టర్/కృష్ణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పర్యటన షాద్‌నగర్‌లో రాజకీయ వేడిని రగిల్చింది. మహబూబ్‌నగర్ వెళ్తున్న క్రమంలో షాద్‌నగర్ పట్టణ బైపాస్, కేశంపేట రోడ్డు వద్ద కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆరు మండలాల నుండి తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా ‘గులాబీ’మయంగా మారింది. జనసంద్రమైన బైపాస్ ఇసుకేస్తే రాలనంత జనంతో షాద్‌నగర్ రోడ్లు కిక్కిరిసిపోయాయి. కేటీఆర్ కాన్వాయ్ అడుగు ముందుకు వేయలేనంతగా కార్యకర్తలు చుట్టుముట్టారు. అంజన్న ఎక్కడ?: జన సందోహాన్ని చూసి ఉత్సాహానికి లోనైన కేటీఆర్.. తన కాన్వాయ్ నుండే “అంజన్న ఎక్కడ?” అంటూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోసం ఆరా తీశారు.
అనంతరం ఆయన్ని దగ్గరకు తీసుకొని పలకరించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. కేటీఆర్‌ను చూడగానే కార్యకర్తలు ఉద్వేగంతో ‘సీఎం.. సీఎం..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. ”ఇది బహిరంగ సభ కాదు.. కేవలం ఒక చిన్న మెసేజ్‌తో వచ్చిన స్పందన!” వై. రవీందర్ యాదవ్ (మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు) కాంగ్రెస్ వైఫల్యాలపై ధ్వజం ఈ సందర్భంగా కేశంపేట మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ జనసందోహమే నిదర్శనమన్నారు. “ఎటువంటి ఆర్భాటం లేకుండా, కేవలం ఒక చిన్న సమాచారంతోనే ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారంటే.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అర్థమవుతోంది. కాంగ్రెస్ తన గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తోంది. రాబోయే కాలంలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.