సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం, జి. వెంకటేశ్వరరావు, నవంబర్ 6 : మండల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎండిఓ మహేష్ కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రాగునీరు విద్యుత్, పారిశుధ్యం నిర్వహణలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జల జీవన్ మిషన్ లో చేపట్టిన పనులకు నిధులు విడుదల లో జాప్యం అవుతున్నందున కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనిచేయలేదని ఏఈ భగవంతు రావు ఎండిఓ దృష్టికి తీసుకు వచ్చారు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలో వివిధ పాఠశాలల తరగతి గదులు కారిపోతున్నాయని ఎంఈఓ లింగమూర్తి తెలియజేశారు. విద్యుత్ శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా చెట్లను నరుకుతున్నందున త్రాగునీటి సరఫరాకు అవరోధం ఏర్పడుతుందని పంచాయతీ కార్యదర్శులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎండిఓ మాట్లాడుతూ సమావేశంలో తన దృష్టికి తీసుకొచ్చిన అన్ని అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇకపై విద్యుత్ శాఖ సిబ్బంది పంచాయతీ అనుమతి లేకుండా చెట్లను తొలగించవద్దని ఆదేశించారు. వివిధ అభివృద్ధి పనులు పూర్తయిన వెంటనే ఇంజనీరింగ్ అధికారులు ఎం బుక్ రికార్డు చేయాలని సూచించారు. కళ్యాణపు లోవ రిజర్వాయర్ గేట్లు మరమ్మతులు పూర్తి చేసినప్పటికీ దీనికి సంబంధించి యంబుక్కున ఇరిగేషన్ అధికారులు రికార్డ్ చేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇకపై విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని అధికారులను కోరారు.