కారేపల్లి, నవంబర్ 6 (సాక్షి డిజిటల్ న్యూస్): కారేపల్లి మండల పరిధిలోని మాదారం, గుంపెల్లగూడెం, పాత చేనగలగడ్డ, రేగులగూడెం, మంగలి తండా, గేట్ కారేపల్లి గ్రామాల్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్కరణ సభలు నిర్వహించారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల వారోత్సవాల భాగంగా ఈ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా సబ్‌డివిజన్ కార్యదర్శి భూక్య శివ నాయక్ మాట్లాడుతూ — “ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను అర్పించిన కమ్యూనిస్టు విప్లవకారుల త్యాగాలు చిరస్మరణీయాలు. నవంబర్ నెలలోనే అనేక అగ్రశ్రేణి విప్లవ నాయకులు అమరులయ్యారు. వారి విప్లవ స్ఫూర్తి, సేవలు ఇవాళ కూడా ప్రజా పోరాటాలకు పునాది” అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ, “మార్క్సిజం–లెవినిజం–మావో సిద్ధాంతాల ప్రేరణతో నక్సలబరి, శ్రీకాకుళం, రైతన్న పోరాటాలు ముందుకు వచ్చాయి. ఈ పోరాటాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గోదావరి లోయ ప్రజా ఉద్యమాలకు బాటలు వేసాయి. అనేకమంది విప్లవ నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం శిరసు మరీ సమర్పించారు. ప్రభుత్వం ఎన్నిసార్లు ఉద్యమాలను అణిచివేయాలన్నా, ప్రజా శక్తిని అడ్డుకోలేకపోయింది” అని పేర్కొన్నారు. “పది లక్షలకు పైగా ఎకరాల పోడు భూములను ప్రజలకు సాధించి పెట్టిన చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానిదే. అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజల కోసం పోరాటాలు కొనసాగిస్తేనే వారికి నిజమైన నివాళి” అని శివ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు ధారావత్ బాలు, చందు, సైదులు, బంగారి శైలజ, కుమారి, పద్మ, పద్మజ, అశోక్, శ్రీరాములు, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
