సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాము నాయక్ (నవంబర్ :5) రైతుల ప్రయోజనాల దృష్ట్యా బంద్‌లో ఎవరూ పాల్గొనరాదు జిన్నింగ్ మిల్లులు యథావిధిగా కొనసాగించాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యాజమాన్య ప్రతినిధులు మార్కెటింగ్ శాఖ అధికారులు, మరియు సిసిఐ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 6వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిన్నింగ్ మిల్లులను బంద్ చేయరాదని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిల్లులను యథాతథంగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో L1, L2, L3 రకాల సమస్యలు లేకపోవడంతో బంద్ అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని రైతులు వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పత్తి కొనుగోలు మరియు ప్రాసెసింగ్ ప్రక్రియలో అంతరాయం కలగకుండా అన్ని మిల్లులు నిరాటంకంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు పత్తి తేమ శాతం 12% మించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు తేమ శాతం పై రైతులకు అవగాహన కల్పించి పత్తి నాణ్యతను కాపాడే విధంగా సూచనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా మార్కెట్ యార్డులలో పత్తి ఆరబెట్టడానికి తగిన సౌకర్యాలు కల్పించి, పత్తి తడివేయకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ సూచించారు. నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి రైతులు మద్దతు ధర పొందాలని కలెక్టర్ సూచించారు. రైతులు సమయానికి పత్తిని మార్కెట్‌కు తీసుకురావడంతో పాటు, మిల్లులు నిరాటంకంగా కొనుగోలు చేయడం ద్వారా జిల్లా వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థ సజావుగా కొనసాగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సిసిఐ బయ్యర్లు జిల్లా మార్కెట్ కమిటీల కార్యదర్శులు మరియు జిన్నింగ్ మిల్లుల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.