పత్తి రైతుల సమ్మేళనం జయప్రదం చేయండి

*రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ

సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 5, పెద్దకడబురు, మంత్రాలయం తాలూకా కర్నూల్ జిల్లా, రిపోర్టర్ గుడిసె శివరాజ్ : నవంబరు 19,20 తేదీలలో ఆదోనిలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగు రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనంను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో పత్తి పంటను రాష్ట్రంలో 4,48,210 హెక్టార్లలో సాగు చేశారన్నారు. కర్నూలు జిల్లాలోనే 2,25,969 హెక్టార్లలో పత్తి పంటను సాగుచేశారని తెలిపారు. రాష్ట్రంలో పండే పంటలో సగం పంట ఇక్కడే సాగుచేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పత్తి సాగు చేసిన రైతాంగం ప్రారంభ దినాల్లో వర్షాభావ స్థితిని, అనంతరం అధిక వర్షాలకు గులాబి రంగు పురుగు, తెల్ల దోమలను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం చేసి 2-3 నెలల నుంచి కురిసిన భారీ వర్షాలకు పత్తి రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాల వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువై పైరు పూత పింజ ఎర్రబడి కుళ్లిపోవడం జరిగిందన్నారు. కాస్తాకూస్తో పంటలు పండితే మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు పంటలను పొలాల్లోనే వదిలేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పత్తి ఎకరాకు 2,3 క్వింటాళ్లు కూడా రాక రైతు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం అన్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నవంబరు 19,20 తేదీలలో ఆదోనిలో జరుగు పత్తి రైతు సమ్మేళనానికి జిల్లాలోని అన్ని ప్రాంతాలు, పత్తి పండించే అన్ని జిల్లాల రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడ్డన్న, అంజినయ్య, మొట్రు వీరేష్, రాముడు, సుభాన్, బాబు, భీమన్న, తిక్కన్న, నాగన్న, చిన్నోడు, ఈరన్న, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *