పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విజయభేరి…

★బలిజిపేట మండలంలో 93% ఉత్తీర్ణత… ★591 మార్కులతో జిల్లా తృతీయ స్థానం సాధించిన దుర్గా శిరీష…

జనం న్యూస్ 1/5/2026 బలిజిపేట ప్రతినిధి పి జయరాం -:గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో బలిజిపేట మండలం 93% ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ 1 సామల సింహాచలం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మండలంలో గల తొమ్మిది జిల్లా పరిషత్ హై స్కూల్స్, కేజీబీవీ తో కలిపి పది పాఠశాలల నుండి మొత్తం 422 మంది విద్యార్థులకు గాను 385 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.
అరసాడ, చిలకలపల్లి హైస్కూల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి 91 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారన్నారు. పెద పెంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పి దుర్గా శిరీష అత్యధికంగా 591 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం అదేవిధంగా జిల్లాలో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా మండల స్థాయిలో వంతరాం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని గోర్జి ఝాన్సీ 586 మార్కులతో ద్వితీయ స్థానం, అజ్జాడ హైస్కూల్ విద్యార్థి ఎల్ పవన్ కుమార్ 583 మార్కులతో తృతీయ స్థానం సాధించడం జరిగిందన్నారు. మండలంలోని రెండు ప్రైవేట్ పాఠశాలల నుండి 85 మందికి గాను 85 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఇందుకు కృషి చేసిన హెచ్ఎం లను ఉపాధ్యాయులను అభినందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండలం నుండి జిల్లా స్థాయిలో 591 మార్కులతో తృతీయ స్థానం సాధించిన పి దుర్గా శిరీష కు మరియు బలిజిపేట మండలంలో పదవ తరగతి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థు లందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.