జిల్లా టాప్-9లో స్థానం దక్కించుకున్న గోరంట్ల గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని హర్షిత

జనం న్యూస్, ఏప్రిల్ 30 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): పదో తరగతి పరీక్ష ఫలితాలలో గోరంట్ల మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో టాపర్‌గా నిలిచిన పాఠశాల విద్యార్థిని ఎం. హర్షిత 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి సత్తా చాటింది. అంతేకాకుండా శ్రీ సత్య సాయి జిల్లా స్థాయిలో 9వ ర్యాంక్ సాధించి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చింది. అదేవిధంగా పాఠశాలలో రెండో స్థానం ఎం. భాగ్యశ్రీ 583 మార్కులతో, మూడో స్థానంలో అర్షియా 581 మార్కులతో, హరిని నంద 581 మార్కులతో నిలిచారు. జిల్లా స్థాయిలో విద్యార్థిని ర్యాంక్ సాధించడం పాఠశాలకు గర్వకారణమని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను స్థానికులు అభినందించారు.