శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం

హైదరాబాద్, మార్చి 15 (సాక్షి డిజిటల్ మీడియా – విలేఖరి అజయ్ కుమార్): రాబోయే మార్చి 27న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సేవలు మరియు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి మరియు ఆలయ అర్చకుల బృందం ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో మంత్రి వాకిటి శ్రీహరి దంపతులను ఆశీర్వదిం చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక వేడుకగా భావిస్తారు. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు, వేదపారాయణాలు, సీతారాముల కల్యాణ మహోత్సవం, రథోత్సవం వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి భద్రాచలం శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌఖ్యం, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో భద్రాచలం ఆలయం కార్యనిర్వాహక అధికారి దామోదర్, ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస రామానుజం, రామాయణ పారాయణకర్త అంతర్వేది కృష్ణమాచార్య, సహాయ కార్యనిర్వాహక అధికారి భవానీ రామకృష్ణలు పాల్గొన్నారు.