పేదల తిరుపతిపై మైనింగ్ కుట్ర.. కురుమూర్తి ఏడుకొండలపై భక్తుల గర్జన!

దేవరకద్ర, మార్చి 15 (సాక్షి డిజిటల్ మీడియా – విలేఖరి అజయ్ కుమార్): మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ శివారులో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో మైనింగ్ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్థానికులు, భక్తులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. కురుమూర్తి స్వామి ఏడుకొండల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో భక్తులు పవిత్ర కొండలను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1600 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం…. కాంచన గుహలో వెలసిన శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం దాదాపు 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. చరిత్ర ప్రకారం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కురుమూర్తి గిరుల్లో వెలిశారని భక్తులు విశ్వసిస్తున్నారు. తెలంగాణ పేదల తిరుపతి ఈ క్షేత్రం తెలంగాణలోనే పేదల తిరుపతి గా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెలరోజుల పాటు జరిగే భారీ జాతరకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. తిరుమల తరహాలో ఏడుకొండలు ఆంధ్రప్రదేశ్‌ లోని తిరుమలలో ఉన్నట్లే కురుమూర్తి స్వామి క్షేత్రంలో కూడా ఏడుకొండలు ఉన్నాయి. తిరుమల కొండల మాదిరిగానే ఇక్కడ కూడా కొండలకు పేర్లు ఉండటం విశేషం. 110 కోట్ల ఘాట్ రోడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన…. 2024లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దాదాపు 110 కోట్ల రూపాయల వ్యయంతో లిమిటెడ్ క్యారియర్ ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన జరిగింది. భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అయితే అదే పవిత్ర కొండల్లో మైనింగ్ తవ్వకాలకు ప్రయత్నాలు మళ్ళీ జరుగుతున్నాయన్న సమాచారం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. 2023లో అడ్డుకున్న స్థానికులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనింగ్‌కు ఇచ్చిన అనుమతులను 2023లో స్థానికులు, భక్తులు తీవ్రంగా అడ్డుకున్నారు. అప్పట్లో ప్రజల నిరసనలతో తవ్వకాలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు క్రషర్ మైనింగ్ కాంట్రాక్టర్ మళ్లీ తవ్వకాలు ప్రారంభించేందుకు ప్రయత్ని స్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పవిత్రమైన ఈ కొండలను నాశనం చేసే కుట్ర జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, బజరంగ్ దళ్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక గ్రామస్తులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరూ కలిసి కురుమూర్తి స్వామి ఏడుకొండలను కాపాడాలని గళమెత్తారు. కురుమూర్తి స్వామి ఏడుకొండలు మా విశ్వాసం… మా ఆత్మగౌరవం. వెంటనే మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి. మైనింగ్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఈ తవ్వకాలను నిలిపివేయాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కురుమూర్తి కొండల్లో మైనింగ్ తవ్వకాలు జరగనివ్వమని, ప్రభుత్వం అనుమతులు ఇస్తే భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని భక్తులు హెచ్చరించారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలను కాపాడటం ప్రతి భక్తుడి బాధ్యత అని స్థానికులు పిలుపునిచ్చారు.