పదవ తరగతి పలితాలల్లో విధ్యార్ధులు ప్రతిభ చూపాలి

★నారాయణ విద్యాసంస్థల అధినేత కొట్టె నారాయణ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్, వేంపల్లి, మార్చి :15, (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాసి ఉన్నత పౌరులుగా ఎదగాలని నారాయణ విద్యాసంస్థల అధినేత కొట్టె నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం వేంపల్లె పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఎంతో కీలకమైన మైలురాయిగా నిలుస్తాయని అన్నారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను పునరావృతం చేసుకుంటూ ధైర్యంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ సమాధానాలు రాయాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదని, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చే విధంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విధ్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.