పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 15 వరంగల్ రిపోర్టర్, జన్ను కోర్నెలు వరంగల్ జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని జెడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకొని, పరీక్షా కేంద్రంలో కల్పించిన కనీస మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు నియమించిన సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పరీక్షా కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను లోపలికి అనుమతించవద్దని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పరీక్షా విధుల్లో ఉన్న సిబ్బంది, వైద్య శిబిర సిబ్బందితో సహా ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలని ఆదేశించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీల సందర్భంగా కలెక్టర్ వెంట చీఫ్ సూపరింటెండెంట్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *