హెడ్లైన్ : పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: ఏఐఎస్ఎఫ్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 12 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ : కౌతాళం మండల కేంద్రంలో ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కౌతాళం మండల విద్యాశాఖ అధికారి శోభారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. ఈరేష్, మండల కార్యదర్శి సాయి వర్మ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పదవ తరగతి పరీక్షల సమయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రంలో చల్లని త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, పరీక్షా గదుల్లో సరిపడా వెలుతురు ఉండేలా చూడాలని, ఫ్యాన్లు సక్రమంగా తిరిగేలా విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం పరీక్షా సమయాలకు అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడపాలని వారు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్పందించిన మండల విద్యాశాఖ అధికారి శోభారాణి మాట్లాడుతూ కౌతాళం మండలంలో మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రథమ చికిత్స సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు అనిమేష్, నాయకులు రాము, తేజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *