వైన్ షాపు అరాచకాలు… ప్రత్యక్ష దృశ్యాలు వెలుగులోకి – భయంతో వణికుతున్న కాలనీ ప్రజలు

*సీఎం ఆదేశాలు పట్టించుకోని సిండికేట్ దుకాణదారులు – మహిళలు, విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన


గోకవరం, దేవీపట్నం (సాక్షి డిజిటల్ న్యూస్): కె. ప్రకాశరావు గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఎదురుగా వాసుదేవ్ వారి వీధి మెయిన్ రోడ్డుపక్కన ఉన్న శ్రీనివాస సిండికేట్ మద్యం వైన్ షాపు కారణంగా స్థానిక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని ఆరోపిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన దృశ్యాల్లో కొందరు వ్యక్తులు రోడ్డుపక్కనే బహిరంగంగా మద్యం సేవించడం, రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరించడం వంటి ఘటనలు కనిపిస్తున్నాయని స్థానికులు తెలిపారు. షాపు పక్క వాసుదేవ్ వారి వీధిలో వాహనాలను అడ్డంగా నిలిపివేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. మందుబాబులు బహిరంగంగా మద్యం సేవించడం మాత్రమే కాకుండా అదే ప్రదేశంలో అసభ్య ప్రవర్తనకు పాల్పడడం, ఇళ్ళు మధ్య కాల కృత్యాలు చేయడం కూడా జరుగుతున్నాయి. మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని కాలనీ మహిళలు ఆరోపిస్తున్నారు. తాగేసిన ఖాళీ మద్యం బాటిళ్లను ఇళ్లలోకి విసిరేయడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో కృష్ణుడు పాలెం గ్రామం చివర పంట పొలాల వద్ద ఉన్న ఈ మద్యం షాపును గాంధీ జయంతి రోజున గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వాసుదేవ్ వారి వీధికి మార్చిన తర్వాత సమస్యలు మరింత పెరిగాయని ప్రజలు చెబుతున్నారు.
ప్రతిరోజూ విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులు, విద్యార్థినులు ఈ దృశ్యాలను చూస్తూ వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం కాలేజీ బస్సుల నుంచి దిగే విద్యార్థినులపై కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై సిండికేట్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఏ క్షణాన ఏ అనర్థం జరుగుతుందోనన్న భయంతో రోజులు గడుపుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని, వైన్ షాపును ప్రస్తుత ప్రాంతం నుంచి వేరే చోటుకు మార్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీ మహిళలు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *