సాక్షి డిజిటల్ న్యూస్, చక్రాయపేట, మార్చి :14 ( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి పనులు వెంటనే వేగవంతం చేయాలని చక్రాయపేట జడ్పిటిసి తాటిగుట్ల శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మండలం లోని మహదేవపల్లి గ్రామంలో జడ్పీటీసీ టీ. శివప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులు, మెగా కంపెనీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మరియు మెగా కంపెనీ ఇంజనీర్ పాల్గొన్నారు. మండలంలో జరుగుతున్న త్రాగునీటి పైప్‌లైన్ పనుల పురోగతి గురించి వారు జడ్పీటీసీతో చర్చించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ టీ. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మండలంలోని అనేక గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. నీటి కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల త్రాగునీటి సరఫరా కోసం వేస్తున్న పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండలంలోని ప్రతి గ్రామానికి త్రాగునీరు అందేలా పనులను సమయానికి పూర్తి చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే త్రాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాయచోటి – వేంపల్లె రోడ్డు వెడల్పు కారణంగా కొంతమంది రైతుల బోర్లను నేషనల్ హైవే రోడ్డు వారు పూడ్చివేయడం జరిగిందని, బోర్లను కోల్పోయిన రైతులకు వెంటనే వారి పొలాల్లో నేషనల్ హైవే రోడ్డు వారు కొత్త బోర్లను వేయాలని అన్నారు. ఈ విషయం పై కడప ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని జడ్పిటిసి తాటిగుట్ల శివప్రసాద్ రెడ్డి తెలిపారు.