వరిగుంతం గ్రామంలో కోతుల బెడద… చింపాంజీ డ్రెస్‌తో తరిమికొట్టిన సర్పంచ్ బృందం

సాక్షి డిజిటల్ న్యూస్ మెదక్ జిల్లా కొల్చారం మండలం రిపోర్టర్ భూమయ్య మెదక్ జిల్లా పరిధిలోని వరిగుంతం గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పంట పొలాల్లోకి దూసుకెళ్లి పంటలను నాశనం చేయడంతో పాటు, రోడ్లపైకి వచ్చి ప్రజలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లలపైకి కోతులు రావడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలో కోతులు ఇళ్లలోకి కూడా చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ మోహన్ మరియు ఉపసర్పంచ్ బాంచ వీరేశం ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. కోతులను గ్రామం నుంచి తరిమికొట్టేందుకు ఒక వ్యక్తికి చింపాంజీ డ్రెస్ వేయించి గ్రామంలో తిరిగించారు. ఆ వ్యక్తిని చూసి కోతులు భయపడి పారిపోవడంతో కొంతవరకు సమస్య తగ్గిందని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ, కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీ కూడా ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.