మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి: లింగాల కమలరాజు

పయనించే సూర్యుడు మార్చి 13, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు).చింతకాని మండలంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు డిమాండ్ చేశారు.శుక్రవారం చింతకాని మండలంలోని నాగులవంచ గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకుడు వంకాయలపాటి సత్యనారాయణ నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.చింతకాని, బోనకల్లు మండలాలు రాష్ట్రంలో అత్యధికంగా మొక్కజొన్న పండించే ప్రాంతాలు అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు రైతుల వద్ద నుంచి కేవలం రూ.1,600కే కొనుగోలు చేస్తున్నారని అన్నారు.మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటే వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కమలరాజు కోరారు. గతంలో కరోనా సమయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎలాంటి క్లిష్ట పరిస్థితులు లేకపోయినా ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జిల్లా మంత్రులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద రూ.15 వేల సహాయం, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ వంటి హామీలు ఇంకా అమలు కావడం లేదని విమర్శించారు.రైతు బీమా అందక రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడి కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు.ఈ సమావేశంలో మంకెన రమేష్, కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్, మాజీ వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, గడ్డం శ్రీనివాస్, వేముల నర్సయ్య, అప్పారావు, బండి రామారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.