పయనించే సూర్యడు మార్చి 13 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు : కష్టం చేసే చేతులకే కాదు, ఆ కష్టాన్ని పంచుకునే గుండెకూ తానే సాటి అని నిరూపించుకున్నారు తాపీ మేస్త్రి వల్లెపు శ్రీనివాస్. ఆర్థిక భారంతో సతమతమవుతున్న ఒక నిరుపేద కార్మిక కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచి, ఆ ఇంటి ఆడబిడ్డ పెళ్లిని ఘనంగా జరిపించి తన ఉదారతను చాటుకున్నారు.సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మండలం, వేపల సింగారం గ్రామానికి చెందిన వేముల వీరబాబు – సునీత దంపతులు బ్రతుకుతెరువు కోసం నడిగూడెం గ్రామానికి వలస వచ్చి నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో, పెద్ద కుమార్తె నాగలక్ష్మి వివాహం చేయడం ఆ కుటుంబానికి పెనుభారంగా మారింది. మాట ఇచ్చి..మనిషిగా నిలబడి..వీరబాబు తన వద్ద పని చేసే తోటి కార్మికుడే కావడంతో, అతని పరిస్థితిని గమనించిన మేస్త్రి శ్రీనివాస్ చలించిపోయారు. "నీ బిడ్డ పెళ్లికి నేనున్నాను" అంటూ భరోసానిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, గురువారం (12-03-2026) జరిగిన నాగలక్ష్మి వివాహ వేడుకకు అయ్యే సుమారు ₹70,000 ఖర్చును తనే స్వయంగా భరించి, పెళ్లిని ఘనంగా జరిపించారు. "సమాజంలో తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడమే నిజమైన సంపాదన."— వల్లెపు శ్రీనివాస్, తాపీ మేస్త్రి ఒక సామాన్య కార్మికుడై ఉండి కూడా, తోటి కార్మికుని పట్ల శ్రీనివాస్ చూపిన ఈ సేవా భావాన్ని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ కొనియాడింది. మండల ప్రజలు, స్థానికులు ఆయనను అభినందనలతో ముంచె త్తుతున్నారు. నేటి సమాజంలో ఇటువంటి మానవతా దృక్పథం అందరికీ ఆదర్శప్రాయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు