సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 14, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండలం సితాయిపేట్ గుడి తండా కి చెందిన జరుపుల కాంతమణి అనే మహిళ శవం అనుమానాస్పద స్థితిలో ధర్పల్లి గ్రామం బస్టాండ్ వెనుకాల ఓపెన్ ప్లాట్స్ వద్ద కనిపించగా, ఈ ఘటనపై ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు సమయంలో లభించిన విశ్వసనీయమైన సమాచారం మేరకు, తేదీ 13-03-2026 నాడు ఉదయం నిందితుడు గుండ్ల నడుకుడ నర్సయ్య (58 సంవత్సరాలు), S/o పోశన్న, నివాసం: ధర్పల్లి గ్రామం కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసి అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం, సత్యమ్మ రైస్ మిల్ సమీపంలో ఉన్న అతని ఓపెన్ ప్లాట్‌లో తనకు చిన్న రేకుల షెడ్ ఉండి, అక్కడ కూరగాయలు పెంచుకుంటూ కట్టెలతో కంచె వేసుకొని ఉపయోగించుకుంటున్నట్లు తెలిపాడు. సీతాయిపేట గ్రామం గుడి తండా కి చెందిన కాంతమణి (లంబాడ కులం) అనే మహిళతో తనకు పరిచయం ఉండి, ఆమె అప్పుడప్పుడు తన షెడ్ వద్దకు వచ్చేదని తెలిపాడు.
తేదీ 11-03-2026 నాడు కాంతమణి తన షెడ్ వద్దకు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య శారీరక సంబంధం జరిగిన తరువాత, కాంతమణి తనకు రూ.300/- ఇవ్వాలని అడగగా, నిందితుడు లేవని చెప్పాడు. దీంతో ఆమె ఈ విషయం గ్రామంలో అందరికీ చెబుతానని బెదిరించడంతో, తన పరువు పోతుందనే భయంతో నిందితుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.అతను చేపల వలకు ఉపయోగించే తెల్లని నైలాన్ తాడు ఆమె మెడకు గట్టిగా చుట్టి గుంజి పట్టుకొని ఆమెను హత్య చేసినట్లు విచారణలో వెల్లడించాడు. ఆమె మృతి చెందిన తరువాత ఎవరికి అనుమానం రాకుండా ముందుగా తన షెడ్ మరియు చెక్క గేటుకు తాళం వేసి మార్కెట్‌కు వెళ్లి చేపలు కట్ చేసే పని చేసి, రాత్రి తిరిగి వచ్చి మృతదేహాన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి ప్లాస్టిక్ సంచిలో పెట్టి తన TVS XL వాహనానికి కట్టి బయటకు తీసుకెళ్లాడు. దమ్మనపేట ఎక్స్ రోడ్ వద్ద డ్రైనేజీ పనుల కారణంగా రోడ్డు బ్లాక్ కావడంతో, కొత్త బస్టాండ్ వెనుక వైపు ప్లాట్ల మధ్యగా వెళ్తుండగా అతని TVS XL వాహనం స్కిడ్ అయి పడిపోవడంతో, ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో వాహనాన్ని మరియు మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయినట్లు తెలిపాడు. తరువాత పోలీసులు కొత్త బస్టాండ్ ప్రాంతంలో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా, అతను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అందువల్ల నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామని సీఐ.B.బిక్షపతి, ఎస్సై S. శ్రీనివాస్ తెలిపారు.