టెక్రియాల్ చెరువు వద్ద పారిశుద్ధ్య పనులలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చ్:14, కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల.అనిల్ కుమార్, 99 రోజుల ప్రజాపాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు టెక్రియాల్ చెరువు వద్ద నిర్వహించిన శానిటేషన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజాపాలన అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, అభివృద్ధి లక్ష్యంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం అని, దీనిని అందరూ క్షేత్ర స్థాయిలో సంపూర్ణంగా పని చేసి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతీ ఏటా వినాయక నిమజ్జనం ఘనంగా జరిగే ప్రాంతం టెక్రియాల్ చెరువు అని, నిమజ్జనం అనంతరం విగ్రహాల యొక్క పీచు పదార్థాలు, స్టాండ్‌లు అలాగే ఉండిపోతున్నాయని ఆమె గుర్తు చేశారు. వాటిని ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని, చెరువు ప్రాంతం ఎల్లప్పుడూ సందర్శకులకు ఆహ్లాదకరంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఆర్డీఓ వీణ, వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, స్థానిక 13వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి లలిత చిట్టిబాబులతో పాటు ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.