జిల్లాలో గ్యాస్ సరఫరపై అపోహలు వద్దు.

★గ్యాస్ సిలిండర్ల కొరతలేదు . ★బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు. ★100 కీ డయల్ చెయ్యండి. ★సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.

ఆందోల్ మార్చి 14 (సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) జిల్లాలో గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కడా లేదని, వినియోగదారులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆమె సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి జిల్లాలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ కొరత పేరుతో నిల్వలు దాచడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ వినియోగదారులు అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయకుండా నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగించరాదని, అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతిరోజు గ్యాస్ బుకింగ్‌లు, సరఫరా వివరాలను సేకరించి పూర్తి పర్యవేక్షణ చేయాలని తెలిపారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఎల్‌పి.జి డిస్ట్రిబ్యూటర్లకు ఏదైనా సమస్య ఎదురైతే స్థానిక ఎస్‌హెచ్‌ఓ లేదా 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా డొమెస్టిక్ లేదా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు తేలితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బాలసరోజ, సహాయ పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, సంక్షేమ శాఖల అధికారులు అఖిలేష్ రెడ్డి, జగదీష్, రాజేశ్వర్ అంబదాస్, లలిత కుమారి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎల్‌పి.జి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, సభ్యులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.