
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 14 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం లోని రెండో బ్యాచ్ కు చెందిన 10 గ్రామాల వార్డు సభ్యులకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018పై నిర్వహించిన కార్యక్రమం శుక్రవారం (మార్చి 13తో) ముగిసింది.శిక్షణ పూర్తి చేసిన వార్డు సభ్యులకు ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే గ్రామాల్లో పారదర్శకమైన పాలన సాధ్యమవుతుందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి ఆదర్శ గ్రామాల నిర్మాణానికి వార్డు సభ్యులు కృషి చేయాలని సూచించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొని తమ హక్కులు, బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీఓ దయాకర్ యాదవ్, టి.ఓ.టి శిక్షకులు అరవింద్ నారాయణ, ఎస్.కె సలీం, ఎన్ సుధాకర్, బి.సంతోష్, సమన్వయం చేసి సభ్యులకు చట్టంపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ నాయుడు, జూనియర్ అసిస్టెంట్ సరస్వతి, కంప్యూటర్ ఆపరేటర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.ఈ శిక్షణ ద్వారా గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతతో, చట్టబద్ధమైన అవగాహనతో గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.