కరీంనగర్ నుండి కొండగట్టుదాకా ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర

★అంజన్నకు మొక్కులు చెల్లించేందుకు సంజయన్న పాదయాత్ర బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేయనున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ ప్రజాప్రతినిధులు టెన్త్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పోలీసులకు సహకరించాలని కోరిన కేంద్ర మంత్రి 8 గంటల్లో 40 కి.మీల పాదయాత్ర చేసి అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్న బండి సంజయ్ మండుటెండలో దారి పొడవునా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్న స్వచ్ఛంద సంస్థలు

పయనించే సూర్యుడు మార్చి 14 కరీంనగర్ న్యూస్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రేపు (శనివారం) ఉదయం ప్రారంభించే ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భారతీయ జనతా పార్టీ పక్షాన నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ సహా ఆ పార్టీ ప్రజాప్రతినిధులంతా పాల్గొననున్నారు. రేపు ఉదయం 7 గంటలకు వీరంతా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం వద్దకు చేరుకుంటారు. బీజేపీ పక్షాన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా బండి సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతున్నారు.
మరోవైపు వేలాది మంది కాషాయ కర్తలు, భక్తమండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్ తో కలిసి కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేసేందుకు సమాయత్తమవు తున్నారు. బీజేపీ పోలింగ్ బూత్ సభ్యుల నుండి పార్టీ రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు అంజన్న ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో కరీంనగర్ అంతా కాషాయ మయమైంది. బండి సంజయ్ చేపట్టిన ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’కు వచ్చే వారికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అలంకరణ చేస్తున్నారు. మరోవైపు ఎండాకాలం ప్రారంభం కావడం… కరీంనగర్ లో రేపు 37 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో…. పాదయాత్రలో పాల్గొనే వారికి అవసరమైన మంచి నీళ్లు, మజ్జిగ వంటి పానియాలను దారి పొడవునా అందుబాటులో ఉంచేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. వీరితోపాటు స్వచ్ఛంద సంస్థలు, భక్తమండళ్ల నిర్వాహకులు సైతం స్వచ్ఛందంగా ఈ పాదయాత్రలో పాల్గొనే వారికి పులిహోర, మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిమగ్నమై ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’లో పాల్గొనేందుకు ఈరోజు రాత్రి(శుక్రవారం) ఢిల్లీ నుండి బయలుదేరి అర్ధరాత్రి సమాయానికి కరీంనగర్ చేరుకుంటారు. శనివారం ఉదయం 6 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం వద్దకు వెళతారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. మహాశక్తి ఆలయ ప్రాంగణం నుండే పాదయాత్ర ప్రారంభం కానుండటంతో…. బీజేపీ ప్రజాప్రతినిధులు, కాషాయ శ్రేణులు, భక్తమండళ్ల ప్రతినిధులంతా పొద్దున్నే అక్కడికే చేరుకుంటారు. వారితో కలిసి సరిగ్గా 7 గంటలకు బండి సంజయ్ ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ను ప్రారంభిస్తారు.అంజన్న ఆశీర్వాద యాత్రను పురస్కరించుకుని కరీంనగర్ నుండి కొండగట్టు వరకు అడగడుగునా బండి సంజయ్ కు మంగళహారతులు, పూల జల్లులు, వీర తిలకంతో స్వాగతం పలికేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు, మహిళలు, కాషాయ సైనికులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పెద్ద ఎత్తున అలంకరణ చేసే పనిలో కాషాయ శ్రేణులు నిమగ్నమయ్యాయి.ప్రధానంగా 10వ తరగతి విద్యార్ధులు వార్షిక పరీక్షలు జరుగుతున్నందున….పాదయాత్ర సందర్భంలో రోడ్డుపై ట్రాఫిక్ జాం కాకుండా క్రమశిక్షణతో నడుస్తూ అంజన్న ఆశీర్వాద యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాషాయ శ్రేణులను కోరారు. ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా ఈ యాత్ర కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ హాజరై ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ను విజయవంతం చేయాలని విజ్ఝప్తి చేశారు.