సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 8 గూడూరు రిపోర్టర్ (చెన్నూరు మస్తాన్) దుగ్గరాజుపట్నం పోర్టు భూసేకరణ వ్యవహారం తిరుపతి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, ముందస్తు సమాచారం లేని సర్వే తీరుపై ఐదు గ్రామాల రైతాంగం ఆగ్రహంతో రగిలిపోతోంది. కనీసం గ్రామసభ నిర్వహించకుండా, రైతులకు నోటీసులు ఇవ్వకుండా చీకటి ఒప్పందాలతో సర్వేకు రావడమేంటంటూ జెమిని కొత్తపాలెం మాజీ సర్పంచ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, జడ్పీటీసీ రౌతు రామకృష్ణ సోదరులు నాగరాజు ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు సర్వే బృందాలను అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం ఏది, అధికారులపై ధ్వజం క్షేత్రస్థాయిలో సర్వే కోసం వచ్చిన అధికారులను చూసి రైతులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మా భూములు ఏమైపోతాయో అన్న ఆందోళనలో మేముంటే, కనీసం సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా సర్వేకు వస్తారా అంటూ అధికారులను నిలదీశారు. ఎమ్మార్వో డౌన్ డౌన్ అంటూ రైతులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. గతంలోనే ప్రైవేటు కంపెనీల చేతిలో మోసపోయామని, ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే రీతిలో వ్యవహరించడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తహసిల్దార్ కార్యాలయం వద్ద దళారీల హడావిడి ఎక్కువైంది ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత తహసిల్దార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సాయంత్రం వేళల్లో తహసిల్దార్ కార్యాలయం చుట్టూ బెంజ్, ఆడి వంటి విలాసవంతమైన కార్లు తిరుగుతున్నాయని, దళారులు, భూబ కాసురుల తో అధికారులు కుమ్మక్కయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది కేవలం సర్వే మాత్రమే కాదని, దీని వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.తాసిల్దార్ ని బదిలీ చేస్తేనే న్యాయం జరుగుతుంది గ్రామస్తులు ముక్తా కంఠంతో డిమాండ్ చేశారు.ప్రస్తుత తహసిల్దార్ అధికార ముసుగులో హిట్లర్ పాలనను తలపిస్తున్నారని, అవినీతికి నిలయంగా మారిన సదరు అధికారులను వెంటనే బదిలీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, అన్యాయంగా మా భూములను వదులుకోం అని వారు భీష్మించుక కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జెమిని కొత్తపాలెం మాజీ సర్పంచులు పురుషోత్తం రెడ్డి, మహేంద్ర, జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, నాగరాజు, వాలిమేడు మాజీ సర్పంచ్ శ్రీహరి, తూపిలిపాలెం కాపులతో పాటు ఐదు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.