సాక్షి డిజిటల్ న్యూస్: మార్చి 3, వేంపల్లి (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) రాష్ట్రానికి బిజెపి ఒక శని గ్రహములా,వైకాపా, టీడీపీలు రాహు కేతువులుగా దాపురించాయని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో తులసి రెడ్డి మాట్లాడుతూ పై మూడు పార్టీలు రాయలసీమకు తీరని ద్రోహం, మోసం,అన్యాయం చేశాయని,ఆ మూడు పార్టీలకు రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తులసి రెడ్డి అన్నారు. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టు ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉండగా పై మూడు పార్టీల కారణంగా ఆ రెండింటిలో ఒకటే కూడా రాయలసీమలో ఏర్పాటు కాలేదు అన్నారు. ప్రత్యేక హోదా అటు రాయలసీమకు ఇటు మొత్తం రాష్ట్రానికి సంజీవని లాంటిది. ఇది రాష్ట్ర హక్కు.ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈపాటికి నవ్యాంధ్ర స్వర్ణాంధ్రై ఉండేది. పై మూడు పార్టీల కారణంగా ప్రత్యేక హోదా అమలు కాక అటు రాయలసీమ, ఇటు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయాయి. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారము కేంద్ర ప్రభుత్వము రాయలసీమకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు ఇవ్వాల్సి ఉండగా పై మూడు పార్టీల కారణంగా ఈ నిధులు రాలేదు.ఆ విధంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు పై మూడు పార్టీలు అన్యాయం చేశాయి. విభజన చట్టంలో 13వ షెడ్యూల్డ్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాల్సి ఉండగా 11 సంవత్సరాలు దాటిన అతీగతీలేదు.ఈ విధంగా పై మూడు పార్టీలు రాయలసీమకు ద్రోహం చేశాయి. రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం 2008 – 2009 రైల్వే బడ్జెట్ లో కడప -రాయచోటి -మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని మంజూరు చేసి మొదటి పేజ్ లో కడప నుంచి పెండ్లి మర్రి వరకు లైన్ పూర్తి చేయడం జరిగింది.కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.ఆ విధంగా పై మూడు పార్టీలు రాయలసీమకు ద్రోహం చేశాయి. రాయలసీమలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన తెలుగుగంగా, గాలేరు నగిరి, హంద్రీనీవా ప్రాజెక్టులు నిధులు లేని కారణంగా గత 11 సంవత్సరాలుగా నత్తనడక సాగుతూ ఉండడం దురదృష్టం. అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు 2021లో కొట్టుకుపోయినప్పటికీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం. కృష్ణానది యాజమాన్యం బోర్డ్ కార్యాలయాన్ని తెలంగాణలోని హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి, రాయలసీమకు ఇప్పటివరకు తరలించకపోవడం శోచనీయం. ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ఆల్మట్టి ఎత్తును పెంచుతూ ఉంటే,తెలంగాణ ప్రభుత్వం ఏ అనుమతులు లేకుండా పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తూ ఉంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైకాపా,టీడీపీ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అత్యంత దురదృష్టకరమని తులసి రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 అక్టోబర్ 29న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించగా స్టేట్ ఎత్తివేతకు అటు వైకాపా ప్రభుత్వం, ఇటు టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేయకపోవడం గర్హనీయమని తులసి రెడ్డి అన్నారు. అందువల్లనే రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు అటు బిజెపి కి గాని, ఇటు వైకాపా, టిడిపిలకు గాని ఏ మాత్రం లేదని తులసి రెడ్డి విరుచుకుపడ్డారు.