సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి:03 వేములవాడ టౌన్ రిపోర్టర్: అక్కనపల్లి పరుశురాం.. వేములవాడ మున్సిపల్ పాలకవర్గం తీరుపై స్థానిక బిఆర్ఎస్ కౌన్సిలర్లు మరియు సీనియర్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు తమను అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో గెలిపిస్తే, ప్రస్తుత పాలకవర్గం ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తోందని వారు విమర్శించారు. ఫిబ్రవరి నెల ముగిసిన మున్సిపల్ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని, అసలు పాలకవర్గం ఏర్పడినప్పటి నుండి ఒక్క సమావేశం కూడా ఎందుకు పెట్టలేదని నిలదీశారు. వార్డుల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వాటిని చర్చించి పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం మీడియాలో ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ, పట్టణ అభివృద్ధిపై లేదని వారు ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ పదవీకాలం విషయంలో ‘చెరో రెండున్నర ఏళ్లు’ అనే ప్రచారంపై ప్రజలకు వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల విషయంలో వెనుకడుగు వేస్తున్న పాలకవర్గం ప్రజలకు సమాధానం చెప్పాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి రాజు, వాసాల లావణ్య, సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మారం కుమార్, కొండ కనుకయ్య, సలీమ్, కందుల క్రాంతి కుమార్, జోగిని శంకర్, గూడూరు మధు, నిమ్మశెట్టి రాజు, రేగుల రాజేశం, పబ్బ మహేష్, మంత సందీప్, మామిండ్ల కనకయ్య, గోసుకుల నరసయ్య, లింగంపల్లి శ్రీనివాస్, గోపు గణేష్ తదితరులు పాల్గొన్నారు.