భజనల నడుమ కోతులకు కన్నీరవ్విన వీడ్కోలు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 3 భూమయ్య పిట్లం. . . పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామంలో ఈరోజు హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. గ్రామ పరిసరాల్లో మృతి చెందిన కోతులకు గ్రామస్థులు అపూర్వమైన గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించారు. కోతులను ఆంజనేయ స్వరూపంగా భావించే భక్తులు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు అర్పించారు. అనంతరం భజనలు, హరినామ సంకీర్తనల మధ్య శోభాయాత్రగా గ్రామ వీధుల గుండా తీసుకెళ్లారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంస్కార కార్యక్రమంలో మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొందరు భక్తులు కన్నీటి పర్యంతమై నివాళులు అర్పించగా, మరికొందరు దీపారాధన చేసి ప్రార్థనలు చేశారు. సాధారణంగా మనుషులకు మాత్రమే జరిగే ఘన సంస్కారాలను జంతువులకు నిర్వహించడం అరుదైన విషయమని స్థానికులు పేర్కొన్నారు. జంతువుల పట్ల గ్రామ ప్రజల భక్తి భావం, మానవత్వం ప్రతిబింబించిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది