నివాస ప్రాంతంలో సెల్ టవర్ ప్రమాదం… బోడుప్పల్ సాయి భవాని నగర్‌లో కలకలం!

*నివాస ప్రాంతంలో టవర్ మంటలు… పెద్ద ప్రమాదం తప్పింది! *సమయానికి ఫైర్ ఇంజన్ చేరుకోకపోతే పెను విషాదం…!అధికారులు స్పందించి వెంటనే సెల్ టవర్లు తొలగించాలి కాలనీవాసుల డిమాండ్…

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 3, 2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్ సాయి భవాని నగర్ లో ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఓ నివాస గృహంపై ఏర్పాటు చేసిన సెల్ టవర్ ఒక్కసారిగా అగ్నికీలలకు ఆహుతైంది.ఇంటి పై నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. టవర్‌కు అనుసంధానంగా ఉన్న కేబుల్ వైర్లలో స్పార్క్ ఏర్పడి, అక్కడి నుంచి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. కొద్ది క్షణాల్లోనే టవర్ మొత్తం మంటల మయమైంది. పొగలు ఎగసిపడుతూ ప్రాంతాన్ని కమ్మేశాయి.స్థానికులు వెంటనే అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది.అయితే… ఇదే ప్రమాదం రాత్రి వేళల్లో జరిగి ఉంటే?ఇంట్లో నిద్రలో ఉన్న కుటుంబాలు? చుట్టుపక్కల ఇళ్లు?ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే భారీ విషాదం తప్పేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికులను కలవరపెడుతున్నాయి.“ఇళ్లపై సెల్ టవర్లు ప్రాణాలకు ముప్పు” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టవర్‌ను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా?
ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇస్తారా? బోడుప్పల్ ప్రజలు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *