ఆందోల్ మార్చి 03 (సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) గ్రామాల సర్వతో
ముఖాభివృద్ధి లో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతా యుతంగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు (నాలుగు మండలాలకు చెందిన 4వ బ్యాచ్) నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణా కార్యక్రమానికి సోమవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడుతూ,శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో గ్రహించి, శిక్షణలో నేర్చుకున్న అన్ని విషయాలు గ్రామాల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామానికి మంచి చేయాలన్న, గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా చట్టపరమైన నిబంధనల మేరకు అమలు చేయాలని తెలిపారు. గ్రామాలలో ఉన్న సమస్యలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, అందుబాటులో ఉన్న నిధులను ఎలా సక్రమంగా వినియోగించుకోవాలి వంటి అంశాలపై ఈ శిక్షణ ద్వారా స్పష్టత లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించడం సర్పంచుల ప్రధాన బాధ్యతని అన్నారు. నిధులను సక్రమంగా వినియోగించి, ప్రాధాన్యత ఆధారంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను మార్చి 31 లోగా పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వేసవి కాలంలో నీటి సరఫరా సవ్యంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా పనిచేయాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులకు సంబంధించిన మెటీరియల్‌తో కూడిన బ్యాగులను జిల్లా కలెక్టర్ సర్పంచులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, మాస్టర్ ట్రైనర్లు, డి.డబ్ల్యూ.ఓ లలిత కుమారి ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
