సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి అరుణ… పటాన్చెరు నూతనంగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీని ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులతో కలిసి రాష్ట్రంలోని ఆదర్శ మున్సి పాలిటీగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం వార్డు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ సుమలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన పురపాలిక తొలి పాలకవర్గ సమావేశానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో నూతనంగా 5 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మున్సిపల్ సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రతి వార్డు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వీటిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి వార్డుని అభివృద్ధి పతంలో ముందుకు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవి రెడ్డి, కమిషనర్ వెంకట కిషన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.