హైదరాబాద్‌ గర్వించదగ్గ వనితకు నీరాజనం

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, (శేరిలింగంపల్లి) హైదరాబాద్ గడ్డపై పుట్టి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ‘భారత కోకిల’ సరోజినీ నాయుడుకు కొండాపూర్‌లోని శారదా హైస్కూల్‌లో శుక్రవారం ఘన నివాళుల ర్పించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో, పాఠశాల కరెస్పాండెంట్ బందా నరేంద్ర బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, హైదరాబాద్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యురాలు దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ 12 ఏళ్ల ప్రాయంలోనే మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన మేధావి సరోజినీ నాయుడు అని, ఆమె ప్రతిభకు ముగ్ధుడైన నిజాం నవాబు ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపారని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా సమసమాజ స్థాపనను కాంక్షించిన ఆమె, గాంధీ అడుగుజాడల్లో నడిచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళగా, దేశంలోనే ప్రథమ మహిళా గవర్నర్‌గా చరిత్ర సృష్టించారని కొనియాడారు. మహిళా సాధికారత, రాజకీయ భాగస్వామ్యం కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, వాణి సాంబశివరావు, శివరామిరెడ్డి, రాజు గౌడ్ మరియు ఉపాధ్యాయుడు శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.