సాక్షి డిజిటల్ న్యూస్ ఆనందపురం రిపోర్టర్ (భాగం స్వాతి సుధాకర్) ఫిబ్రవరి 14: వర్షం పడితే రోడ్లపై నీరు నిల్వ ఉండటం సహజం. కానీ కాలానికి సంబంధం లేకుండా ప్రతిరోజూ రోడ్డుమీదే కాలువనీరు, వ్యర్థపనీరు నిల్వ ఉండటం సహజమేనా? ఇదే పరిస్థితి ఆనందపురం మండలంలోని వెల్లంకి రహదారిపై కనిపిస్తోంది. ముఖ్యంగా నారాయణ కాలేజ్, రవీంద్ర భారతి స్కూల్ పరిసర ప్రాంతంలో తరచూ మురుగు నీరు రోడ్డుపై నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. రోడ్డుమీద నిలిచిన మురుగు నీటిని దాటి వెళ్లాల్సి రావడంతో తీవ్ర అసౌకర్యాని కి గురవుతున్నారు. బురద చిమ్ములు, దుర్గంధం కారణంగా చిన్నారులు స్కూల్కు చేరుకునేలోపే ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు జారి పడే ప్రమాదం కూడా నెలకొంది. స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తాత్కాలికంగా మాత్రమే చర్యలు తీసుకున్నారని, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఇప్పటివరకు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే ఈ సమస్యకు కారణమని చెబుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం ఎంతవరకు సమంజసం? ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే ఈ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించరా? శాశ్వత పరిష్కారం ఎప్పుడు అందిస్తారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
