మార్చిలో పరిషత్‌ వార్‌

*మొదటి వారంలో రెండు విడతల్లో జరిగే చాన్స్‌. *రైతు భరోసా నిధులు ఖాతాల్లో వేసి ఎన్నికలకు.

సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిబ్రవరి 14 రిపోర్టర్ షేక్ సమీర్ తెలంగాణ రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఫలితాలు తమ అంచనాల మేరకు ఉంటే.. అదే ఊపులో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎన్నికలు జరగకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోయే అవకాశం ఉంది.. అందుకే పరిషత్‌ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్నీ కుదిరితే.. బడ్జెట్‌ సమావేశాలకు ముందే ప్రభుత్వం పరిషత్‌ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిశాక ఈ నిధులను రైతుల ఖాతాల్లో వేసి.. ఆ తరువాత పరిషత్‌ ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెబుతున్నాయి. మార్చి తొలివారంలో రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన వరుస ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూల ఫలితాలే వస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *