బాధేసింది … పరిగెత్తు కొచ్చాను

★'కస్తూరీబా' సంఘటనపై సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య

సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, ఫిబ్రవరి 14 2026, ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు లోని కస్తూరీబా విద్యాలయం సంఘటన తెలియగానే, బాధేసిందని, వెంటనే పరిగెత్తు కొచ్చాను అని ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమం బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన హుటా హుటిన కస్తూరిబా విద్యాలయానికి వచ్చారు. ఎలుకలు కొరికిన 12 మంది విద్యార్థినులను పేరు పేరునా పలకరించారు. దగ్గరకు తీసుకొని ఆరోగ్య పరిస్థితిని, సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.హాస్టల్ ను, మరుగుదొడ్లను, డార్మెంటరీని పరిశీలించారు. అక్కడకు విచ్చేసిన ఆర్డీవో,ఎమ్మార్వో, ఎంపీడీవో అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమన్నారు. విద్యాలయ పర్యవేక్షకుల నిర్లక్ష్యం కారణంగానే సంఘటన జరిగిందన్నారు. విద్యార్థులు చెబుతున్నా, శాశ్విత పరిష్కార చర్యలు తీసుకోవటంలో విఫలం అయ్యారని చెప్పారు. ఒక వ్యక్తి నిర్లక్ష్యం పదిమందికి తలవంపులు తెస్తోందని, ఒక్కరు తప్పు చేసినా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలల, హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా చర్యలు తీసుకునేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, సంక్షేమ బోర్డు నిర్మాణమే అందుకు ఉదాహరణ అని తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఇలాంటి సంఘటనల పట్ల పర్యవేక్షకులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇది జరిగిందేదో జరిగింది, సరి చేసుకోండి, సరిదిద్దు కోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పే తప్పుకాదని, తప్పనిసరిగా సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీవో చెప్పారన్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ , వైద్య ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ ఫోన్లు చేసి పరిస్థితిని ఆరా తీశారు అన్నారు. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. కస్తూరిబా పాఠశాలలో అన్ని చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు, జిల్లా కలెక్టర్ కు, నివేదిక ఇవ్వనున్నట్లు బాలకోటయ్య తెలియజేశారు. పాఠశాల పరిశీలనలో ఆర్గానిక్ కార్పొరేషన్ చైర్మన్ చావల దేవదత్తు, ఏ కొండూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి, బరోత్ పీక్లానాయక్, ప్రేమ్ రాజ్, చైతన్య, స్వామి తదితరులు ఉన్నారు.